Showing posts with label జిటెక్. Show all posts
Showing posts with label జిటెక్. Show all posts

Sunday, January 4, 2015

LaTeX లో పత్రము (The Document in LaTeX)



LaTeX లో పత్రము (The Document in LaTeX)




ఇప్పుడు మనం లాటెక్ ఉపయోగించి అధ్యాయములు, సెక్షను మొదలగు వాటితో మన పత్రాలను ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఇంతకు ముందు మనము ప్రతి లాటెక్ దస్త్రము ఏ విధముగా మనము తయారు చేయదలచుకున్న పత్రమును ముందుగానే \documentclass{...} తో నిర్ధారిస్తున్నామో చూసాము. అలాగే పత్రాలలో ఉన్న తరగతులను (classes) కూడా తెలుసుకున్నాము. చిన్న చిన్న వ్యాసాలను తయారు చేయడానికి article, పుస్తకాలను తయారు చేయడానికి book వాడతాము. ఇవి కాకుండ లాటెక్ లో ఇంకా  మరియు  అనే తరగతులు కూడా ఉన్నాయు.

మనము తయారు చేయదలచుకున్న పత్రము ఎటువంటిదో తెలపడమే కాకుండా మనము మరికొన్ని వికల్పాలను (options) కూడా లాటెక్ లో \documentclass[options]{class} విధంగా తెలుపుతాము. దీని ద్వారా మనము మన పత్రము యొక్క సాధారణ  స్వరూపాన్ని మార్చవచ్చు.

జాగ్రత్తగా గమనించండి మనము వికల్పాలను స్క్వేర్ బ్రాకెట్లలో వ్రాస్తాము. లాటెక్ లో అన్ని ఆజ్ఞలకు ఉన్న వికల్పాలను ఎల్లప్పుడు స్క్వేర్ బ్రాకెట్ లో వ్రాసి ఆజ్ఞలను తరువాత మీసాల బ్రాకెట్ (braces) లో వ్రాస్తాము.


ఖతి పరిమాణము

మన పూర్తి పత్రములో వాడే ఖతి పరిమాణాన్ని ఏదేని క్రింది వికల్పము ద్వారా ఎంచు కుంటాము.

10pt 11pt 12pt

ఉదా \documentclass[11pt]{article}  ద్వారా మన పత్రములోని ఖతి పరిమాణము 11pt ఉండాలని నిర్ణయిస్తున్నాము. మనము ఏ విధమయిన వికల్పాన్ని ఇవ్వక పోయిన లాటెక్ మన పత్రాన్ని 10pt ఖతి లో తయారు చేస్తుంది.

కాగితపు పరిమాణము

లాటెక్ తనదయిన పద్ధతిలో లైనులను ముక్కలు చేసి పేరాగ్రాఫులుగా మారుస్తుంది. అలాగే కొన్ని లైనులు అయ్యిన తరువాత నిలువుగా ముక్కలు గా చేసి తనదయిన పద్ధతిలో పేజీలు గా మారుస్తుంది. ఇలా చెయ్యాలంటే లాటెక్ కు కాగితపు పొడవు, వెడల్పులు తెలిసి ఉండాలి. కాగితవు పరిమాణమునకు ఇవ్వవలసిన వికల్పాలు క్రింద ఇవ్వబడ్డాయి.

letterpaper       11 x 8.5 in.
 a4paper             297 x 210 mm
legalpaper         14 x 8.5 in
a5paper               210 x 148 mm
executivepaper 10.5 x 7.25 in
 b5paper              250 x176 mm

సాధారణంగా పెద్దగా ఉన్న కొలతలు నిలువును సూచిస్తాయి. ఏవిధమయిన వికల్పము ఇవ్వక పోయిన లాటెక్ కాగితపు పరిమాణమును letterpaper గా తీసుకుంటుంది.

పుట నమూనా (Page Format)

పుట లోని మాటర్ ను ఒక కాలమ్ లో కావాలా లేదా రెండు కాలమ్ లలో కావాలా అన్నదానిని క్రింది వికల్పము ద్వారా సూచించవచ్చు

singlecolumn  doublecolumn

వికల్పము లేక పోయిన మీ పత్రము singlecolumn లో కూర్ప బడుతుంది.

అలాగే చివరిగా మీ పత్రము పుటకు రెండవైపులా ముద్రింపబడాలా లేక ఒక వైపే ముద్రింప బడాలా అన్న దానిని క్రింది వికల్పముల ద్వారా నిర్ధారించ వచ్చు

onside  twoside

ఈ రెండిటి మధ్య తేడా ఏమనగా, twoside వికల్పమును ఎన్నుకొన్న పుట సంఖ్యలు  బేసి పుటలలో కుడి వైపున, సరి పుటలలో ఎడమ వైపున ముద్రింపబడతాయి. దీని వలన ఏవిధమయిన ఆటంకములు లేకుండా పుట సంఖ్యలను చూడవచ్చు. book తరగతికి twoside, డిఫాల్టు కాగా article, report, letter తరగతులకు oneside డిఫాల్టులు.

అలాగే ముఖపత్రము (title page)విడిగా కావాలా, అఖ్ఖరలేదా అన్నదాన్ని క్రింది వికల్పాలతో ఎన్నుకొనవచ్చును

titlepage, notitlepage

article తరగతికి notitlepage డిఫాల్టు కాగా, book తరగతికి డిఫాల్ట్ titlepage.

అలాగే మన పత్రములో అధ్యాయములను చేర్పవచ్చును (దానిని ఎలా చేయాలో ముందు తెలుసుకుందాము). సాధారణంగా పుస్తకాలలో ప్రతి అధ్యాయము కుడివైపున (బేసి పుటలో) ప్రారంభమవుతుంది. అలాకాక ఎటుపక్క ఖాళీ ఉన్న అక్కడే అధ్యాయము ప్రారంభమవవలెన్నదానికి క్రింది వికల్పాన్ని ఎన్నుకోవాలి.

openany, openright

openany అన్నది report తరగతికి డిఫాల్ట్ కాగా, openright అన్నది book తరగతికి డిఫాల్టు.


పుట స్టైలు

మన పత్రము స్వరూపము ఎలా ఉండాలో నిర్ణయించుకున్నాక పుట స్వరూపము ఎలా ఉండాలో నిర్ణయించు కుందాము. లాటెక్ పరిభాషలో ప్రతి పుటకు హెడ్ మరియు ఫూట్ ఉంటుంది అందులో పుట సంఖ్య మరియు అధ్యాయము లేక సెక్షను పేరు ఉంటాయి. ఎక్కడ ఏమి ఉండాలి అన్నది క్రింది ఆజ్ఞ ద్వారా నిర్ణయింపబడుతుంది.

\pagestyle{...}

ఈ క్రింది మాండేటరీ ఆర్గ్యుమెంట్ల ద్వారా పేజి స్టైల్ ను నిర్ణయించవచ్చు

plain      empty    headings   myheadings

plain  అన్న అప్షన్ ను ఇచ్చిన హెడ్ ఖాళీగా ఉండి పుట సంఖ్య ఫూట్ లో మార్జిన్లకు మధ్యలో సెట్ అవుతుంది. ఇది article క్లాసుకు డిఫాల్ట్ ఆఫ్షను.

Empty అన్న ఆప్షన్ ఇచ్చిన హెడ్ కాని, ఫుట్ కాని ఉండదు. అలాగే పుట సంఖ్యలు కూడా రావు.

Headings  అన్న ఆప్షన్ తో book, report క్లాసులకు oneside అన్న ఆప్షన్ ఇచ్చిన కుడి పుట హెడ్ లో అధ్యాయము పేరు వచ్చును, అదే twoside అన్న ఆఫ్షన్ ను ఇచ్చిన ఎడమ వైపు అధ్యాయము పేరు కుడి వైపు న సెక్షను పేరు వచ్చును.

myheadings]అన్న ఆప్షన్ ఇచ్చిన headings కు వలెనే హెడింగ్ లు వచ్చును కాని మనకు కావలసిన హెడింగ్ లను markright, markboth లతో నిర్ణయించవలసి ఉండును.

పుట సంఖ్య

పుట సంఖ్యల రూపు రేఖలను ఈ క్రింది ఆజ్ఞ ద్వారా నిర్ణయించవచ్చు

\pagenumbering{...}

దీని మాండేటరీ ఆప్షన్లు క్రింద ఇవ్వబడ్డాయి

arabic   roman   Roman   alph   Alph

arabic తో ఇండో-అరబిక్ సంఖ్యలు, roman తో చిన్నబడి (lower case) రోమన్ సంఖ్యలు, Roman తో పెద్దబడి రోమన్ సంఖ్యలు, alph తో చిన్నబడి ఆంగ్ల అక్షరాలు మరియు Alph తో పెద్దబడి ఆంగ్ల అక్షరాలు పుట సంఖ్యలు గా వస్తాయి.

క్రింది ఆజ్ఞతో మనము పుటసంఖ్య మనకు కావలసిన సంఖ్యకు మార్చుకొనవచ్చు

\setcounter{page}{number}

పత్రములోని భాగములు

పత్రములు (సాధారణంగా పెద్దవి) అధ్యాయములు, సెక్షనులు, సబ్ సెక్షనుల క్రింద విభజింప బడి ఉంటాయి. వీటిని తయారు చెయ్యడానికి చాలా విషయాలను దృష్టి లోనికి తీసుకోవాలి. కాని లాటెక్ లో వీటన్నిటిని సులభం చెయ్యడానికి చాలా  పద్దతులు ఉన్నాయి

ప్రతి పత్రములోని title విభాగము పత్రము  పేరు, పత్రము యెక్క రచయిత పేరు  మరికొన్ని సార్లు తేదీ ఉంటాయి. Title ను తయారు చెయ్యడానికి  క్రింది ఆజ్ఞలను ఉపయోగిస్తాము

\begin{verbatim}
\title{Title of the document}
\author{D. Venu Gopal}
\date{Dec. 27, 2014}

\maketitle
\end{verbatim}

పైన రచయిత పేరు మాత్రమే ఇచ్చాము. మరి పూర్తి చిరునామా కావాలంటే ?

\begin{verbatim}
\title{Title of the document}
\author{D. Venu Gopal\\Banaras Hindu University\\Varanasi 221 005}
\date{Dec. 27, 2014}

\maketitle
\end{verbatim}

క్రొత్త పంక్తి ప్రారంభమవడానికి \\  ఉపయోగపడుతుంది. అలాగే పంక్తుల మధ్య ఎక్కువ దూరం కావాలంటే \\[10pt] అని టైపు చేయాలి. అలాగే ఒకోసారి రచయిత లేక పత్రం గురించి ప్రత్యేక విషయం వ్రాయవలసి వస్తుంది. దానికి క్రింది విధంగా చేయాలి 

\begin{verbatim}
\title{Title of the document}
\author{D. Venu Gopal\thanks{Supported by UGC Senior Fellowship}\\
Banaras Hindu University\\Varanasi 221 005}
\date{Dec. 27, 2014}

\maketitle
\end{verbatim}

\thanks{xyz} అన్న ఆజ్ఞను ఇచ్చినపుడు \LaTeX\ అక్కడ ఒక చిహ్నాన్ని ఉంచి మాటర్ ను ఫుట్ నోట్ క్రింద పుటలో క్రింది భాగాన టైప్ సెట్ చేస్తుంది.

సారాంశము (Abstract)

ప్రతి పరిశోధన పత్రములో టైటిల్ తరువాత సారాంశము ఉంటుంది. దీనిని టైప్ సెట్ చేయడానికి \begin{abstract}
 .. \end{abstract} అన్న ఎన్వైరాన్ మెంట్ మధ్య మన సారాంశాన్ని టైపు చెయ్యాలి. దీనిని \LaTeX\ రెండు మార్జిన్ల మధ్య బొద్దు అక్షరాలతో Abstract అని టైప్ సెట్ చేసి, సారాంశాన్ని మెయిన్ మాటర్ కన్న చిన్న అక్షరాలలో రెండు వైపులా కొంత మార్జిన్ ను వదిలి టైప్ సెట్ చేస్తుంది. రిపోర్టు క్లాసులో అయితే విడిగా వేరే పుటలో ఈ సారాంశాన్ని టైపు సెట్ చెయ్యగా ఆర్టికల్ క్లాసులో టైటిల్ క్రింద సారాంశాన్ని టైప్ సెట్ చేస్తుంది. అదే మీరు ఆర్టికల్ క్లాసులో టైటిల్ పేజ్ అన్న ఆప్షన్ ఇచ్చిన టైటిల్ ఒక పుటలోని, సారాంసము విడిగా వేరొక పుటలోని టైప్ సెట్ అవును. బుక్ క్లాసు కు Abstract ఎన్వైరాంన్ మెంట్ లేదు.

పత్రాన్ని విభజించడం

పుస్తకాలు సాధారణంగా అధ్యాయాల క్రింద, అధ్యాయాలు మరల సెక్షన్ క్రింద, సబ్ సెక్షన్ క్రింద విభజింప బడి ఉంటాయి. పుస్తకాలు తయారు చెయ్యడానికి లాటెక్ లో మనకు క్రింది ఆజ్ఞలు దొరుకుతున్నాయి

\chapter
\section
\subsection
\subsubsection
\paragraph
\subparagaraph
\end{verbatim}

\chapter అన్న ఆజ్ఞ బుక్ మరియు రిపోర్టు క్లాసులకు మాత్రమే పరిమితమవగా, \section నుండి \subparagraph అన్న ఆజ్ఞవరకు ఉన్న ఆజ్ఞలు అన్నీ బుక్, రిపోర్టు, ఆర్టికల్ క్లాసులకు దొరుకుతున్నాయి. ఇందులో పత్రములో భాగములు అన్నదానిని ఈ క్రింది విధముగా టైపు చేసాము

పత్రములోని భాగములు

మీరు గమనించారో లేదో అధ్యాయము, సెక్షనులకు స్వయంగా నంబరింగ్ అవుతోంది. మనకు నెంబరు లేని అధ్యయము, సెక్షను కావాలంటే స్టార్డ్ వెర్షన్ లు కూడా ఉన్నాయి. అంటే \chapter*{heading}  అని టైపు చేసిన నెంబరు రాదు. అలాగే \section మొదలయిన వాటికి కూడా స్టార్డ్ వెర్షన్ ఉంది. \paragraph మరియు \subpaaragraph లకు నెంబరింగ్ అవదు.


Monday, December 29, 2014

LaTeX ప్రాధమిక విషయాలు – LaTeX Basics



HTML లాగా లాటెక్ కూడా ఒక మార్కప్ లాంగ్వేజ్. అందువల్ల మీరు మీ డాక్యుమెంటును మార్కప్ చేస్తారు. అది ఎలాగో తెలుసుకుందాము.

మీరు టెక్ సరిగ్గా స్థాపించబడిందో లేదో చూడడానికి ఒక చిన్న ఫైలు తయారు చేసి రన్ చేసారు కదా. ఇప్పుడు దానిని పరిశీలిద్దాము.

ప్రతి లాటెక్ దస్త్రము \documentclass అనే ఆజ్ఞ (command) తో మొదలవుతుంది. జాగ్రత్తగా గమనించండి అది \ దీనినే backward slash అంటారు. ఇది / forward slash కాదు. 

 \documentclass తరువాత మనం {article} అని వ్రాసాము. లాటెక్ లో ఆజ్ఞలు అన్నీ backward slash తో మొదలవుతాయి. లాంపోర్ట్ డాక్యుమెంట్లను article, book, report మరియు letter అనే క్లాసులు గా విభజించాడు. Article క్లాసును జర్నల్స్ పంపే వ్యాసాలకోసం వాడతారు. Book క్లాసును పుస్తకాలకోసం, report క్లాసును రిపోర్టుల కోసము,  letter క్లాస్ ను జాబులు (ఉత్తరాలు) వ్రాయడానికి ఉపయోగిస్తారు. ముందుగా మనం article క్లాస్ ను వాడడం తెలుసుకుందాము.

తరువాత మనం ఎక్కువగా వాడే ఆజ్ఞ \begin{document} \end{document}. దీనిని ఎన్వైరాన్ మెంట్ అని కూడా అంటారు. ఇది లాటెక్ లోని అతి పెద్ద ఎన్వైరాన్ మెంటు. మనం టైప్ సెట్ చేయవలసిన మ్యాటరు మొత్తం ఈ \begin{document}
 \end{document} ల మధ్య ఉంచాలి.

\documentclass మరియు \begin{document} ల మధ్య ఉన్న స్థలాన్ని ప్రియంబుల్ అంటారు. మనం వాడే ప్యాకేజీలను, మనం మన డాక్యుమెంట్ కోసం తయారు చేసుకున్న మాక్రోలను ఇక్కడ ఉంచుకోవాలి.

తరువాత మీరు \title{ xyz }  అని టైపు చెయ్యండి. xyz  అని వ్రాసి ఉన్నచోట మీ ఆర్టికల్ పేరు వ్రాయండి. దాని తరువాత \author{abc} అని టైపు చెయ్యండి. ఇక్కడ abc అని వ్రాసి ఉన్నచోట మీ పేరు వ్రాయండి.
దీని తరువాత మీరు \begin{document} తరువాత  \maketitle అని టైపు చెయ్యండి. ఇప్పుడు మీ డాక్యుమెంటు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది:

\documentclass{article}
\title{This is a test document}
\author{D. Venu Gopal}
\begin{document}
\maketitle
\end{document}

ఇప్పుడు మీరు \LaTeX\ రన్ చెయ్యండి (ఎలా రన్ చెయ్యాలో గుర్తుంది కదా - F1 నొక్కండి లేదా పైన ఆకుపచ్చ రంగులో ఉన్న డబుల్ యారోస్ మీద క్లిక్ చెయ్యండి). \LaTeX\ రన్ అయి పిడియఫ్ డాక్యుమెంట్ ప్రక్క విండోలో తెరుచుకుంటుంది.

 \title  అనే మాక్రోలో ఇచ్చిన ఆర్టికల్ పేరు పేజి మధ్యలో పెద్ద సైజు లో వచ్చింది. అలాగే \author మాక్రోలో ఇచ్చిన రచయిత పేరు కూడా పేజి మధ్యలో ఆర్టికల్ పేరు తరువాత కొంచెం చిన్న సైజులో వస్తుంది.
ఆర్టికల్ లో తరువాత వచ్చే అంశం abstract. దీని కోసం మీరు \maketitle తరువాత \begin{abstract} \end{abstract} అనే ఎన్వైరాన్ మెంట్ టైపు చేసి దాని మధ్య మీ abstract ను టైపు చెయ్యండి. ఇప్పుడు తిరిగి లాటెక్ ను రన్ చెయ్యండి. Abstract అన్నది పేజి మధ్యలో బొద్దు మరియు చిన్న అక్షరాలలో ప్రింటు అవుతుంది. తరువాత మీరు టైపు చేసిన abstract చిన్న అక్షరాలలో  పేజి కి రెండు వైపుల కొంచెం మార్జిన్ ను వదిలి  టైపు సెట్ అవుతుంది.

దాని తరువాత నుండి మీ ఆర్టికిల్ మొదలవుతుంది. ఇక్కడ \section{xyz} అని టైపు చేసి xyz అని ఉన్న చోట మీరు కావాలనుకున్న హెడింగ్ ను టైపు చెయ్యండి. ఉదా. Introduction, Materials and Methods, Discussion, Results మొ. సెక్షన్ తరువాత సబ్ సెక్షను ఉన్నచో \subsection{abc} అని టైపు చేసి abc అని ఉన్న చోట మీ సబ్ హెడింగ్ ను టైపు చెయ్యండి. ఇలాగే \subsubsection{}, \paragraph{}, \subparagraph{}  లు కూడా ఉన్నాయి. సెక్షన్ హెడింగ్ టైపు చేసిన తరువాత కొంత మాటర్ ను టైపు చెయ్యండి. ఇప్పుడు మరల లాటెక్ ను రన్ చెయ్యండి. లాటెక్ మీద పట్టు సాధించే వరకు మీరు కొంచెం కొంచెం మాటర్ ను టైపు చేసి లాటెక్ ను రన్ చెయ్యండి.

\section, \subsection మొదలగు మాక్రోలవల్ల ఇంకొక లాభం కూడా ఉంది. పైన మీరు \maketitle అని టైపు చేసారు కదా దాని తరువాత ఇప్పుడు  \tableofcontents అని టైపు చెయ్యండి. తిరిగి లాటెక్ ను రన్ చెయ్యండి. ఇప్పడు విషయ సూచిక తయారయ్యింది చూసారా. ఇదీ లాటెక్ వల్ల లాభం. ఇల్లాంటివి ఇంకా ఎన్నో ముందు ముందు చూస్తారు.

LaTeX లో దస్త్రాన్ని తయారు చేసేటపుడు పాటించాల్సిన నియమాలు

లాటెక్ ఉపయోగించి మీ పుస్తకము లేక వ్యాసాన్ని తయార చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.

ఖాళీ స్థలము (space)

ఇంగ్లీషు భాషలో వాక్యము పూర్తి అయినపుడు ఫుల్ స్టాపు వాడతాము. తిరిగి వాక్యము మొదలుపెట్టినపుడు టెక్ ఫుల్ స్టాప్ కు తరువాతి వాక్యమునకు మధ్య కొంచెం ఎక్కువ ఖాళీ స్థలాన్ని వదులుతుంది (ఇది మన కంటికి కనపడనంత చిన్నగా ఉంటుంది). అలాగే ఎబ్రివేషన్లలో కాపిటల్ అక్షరము తరువాత ఫుల్ స్టాప్ వచ్చినను టెక్ ఎక్కువ ఖాళీ స్థలాన్ని వదలదు. కాని అన్నసార్లు ఫుల్ స్టాప్ తరువాత వాక్యము మొదలవ వలసిన అవసరము కాని, క్యాపిటల్ లెటర్ తరువాత ఫుల్ స్టాప్ వచ్చి తిరిగి క్యాపిటల్ లెటరు వచ్చిన అది ఎబ్రివేషను అవ్వాలన్న నియమము లేదు. దాని కోసం ఈ క్రింది విధం గా చెయ్యాలి.

Carrots are good for your eyes, since they contain Vitamin A\@. Have
you ever seen a rabbit wearing glasses?

పై వాక్యములో విటమిన్ A తరువాత ఫుల్ స్టాప్ ఉంది. తిరిగి వాక్యము మొదలవడము తో క్యాపిటల్ లెటర్ వచ్చింది. ఇటువంటి చోట్ల ఫుల్ స్టాప్ కు ముందు \@ ను వాడిన కొంచెము ఖాళీ స్థలము ఎక్కువగా వచ్చును.
అటులనే క్రింది దానిని పరిశీలించండి.

The numbers 1, 2, 3, etc.\ are called natural numbers. According to
Kronecker, they were made by God; all else being the works of Man.

పై వాక్యములో etc తరువాత ఫుల్ స్టాప్ వాడబడింది. కాని ఇక్కడ వాక్యము పూర్తి కాలేదు. అందు వల్ల ఫుల్ స్టాప్ తరువాత  \  వాడబడింది. దీని వల్ల టెక్ ఫుల్ స్టాప్ తరువాత ఎక్కువ ఖాళీ స్థలాన్ని వదలదు.
పై రెండు ఉదాహరణలను చేసి చూడండి.

ఈ క్రింది వాక్యము  I think \LaTeX is fun.  ను టైపు చెయ్యడము ద్వారా పొందినాము.
I think LaTeX is fun.

\LaTeX\ అన్న పదము తరువాత ఖాళీ స్థలము లేదు చూశారా.  ఇక్కడ కూడా \LaTeX\ తరువాత ఖాళీ స్థలము కావాలన్న \LaTeX\ అని టైపు చెయ్యాలి. \LaTeX అన్నది ఒక మాక్రో. ఇటు వంటి మాక్రోల తరువాత ఖాళీ స్థలము కావలెనన్న మాక్రో తరువాత \ లేక {} ను వాడాలి.
Dr., Fig. మొదలయిన ఎబ్రివేషన్ల తరువాత ~ ను వాడాలి. ఉదా. Dr.~Knuth, Fig.~2 దీని వల్ల హార్డ్ స్పేస్ ఏర్పడుతుంది మరియు Fig.~2 అన్నవి విడిపోవు.

కోట్లు (Quotes)

Note the difference in right and left quotes in ‘single quotes’
and ‘‘double quotes’’.

పై వాక్యములోని కోట్స్ క్రింది విధముగా టైపు చేయడం ద్వారా పొందినాము.

Note the difference in right and left quotes in `single quotes'
and ``double quotes''.

లేదా క్రింది విధంగా కూడా పొందవచ్చు -
Note the difference in right and left quotes in \lq single quotes\rq\
and \lq\lq double quotes\rq\rq.

డాష్ లు

X-rays are discussed in pages 221--225 of Volume 3---the volume on
electromagnetic waves.

పై వాక్యాన్ని క్రింది విధంగా టైపు చెయ్యడం ద్వారా పొందగలిగాము.
X-rays are discussed in pages 221--225 of Volume 3---the volume on
electromagnetic waves.

- టైపు చేసిన హైఫను, -- టైపు చేసిన పెద్ద డాష్ (దీనిని n డాష్ అని కూడా అంటారు) --- టైపు చేసిన ఇంకా పెద్ద డాష్ (దీనిని m డాష్ అని కూడా అంటారు) వచ్చును.

చిహ్నాలు (Accents)
కొన్ని ఇంగ్లీషు అక్షరాల మీద చిహ్నాలు ఉంటాయి. వాటిని ఈ క్రింది విధంగా పొందవచ్చు.

\'o  & \'o & \`o & \`o & \~o & \~o & \b o & \b o\\
\- o & \- o & \. o & \. o & \" o & \" o & \d o & \d o\\

ఇంగ్లీషు భాషకు చెందని కొన్ని అక్షరాలు కూడా \LaTeX\ లో దొరుకుతాయి. వాటిని  క్రింది విధంగా టైపు చెయ్యాలి

\oe & \oe & \OE & \OE & \ae & \ae & \AE & \AE\\
\aa & \aa & \O & \O & \l  & \l & \o & \o\\

స్పెషల్ సింబల్స్

\LaTeX అని టైపు చేసిన \LaTeX\ అని టైపు అవుతుందని, అలాగే మనకు ఖాళీ స్థలము కావలెనన్న \ టైపు చెయ్యాలని తెలుసు కున్నాము కదా. మరి మన పత్రములో ఎక్కడైనా \ కావాలన్న ఏమిచెయ్యాలి? \LaTeX\ లో & # $
% ~^ \ మొదలయిన వాటిని రిజర్వ్ కారెక్టర్లు అంటారు. వీటిని టైపు చెయ్యాలంటే క్రింది విధంగా టైపు చెయ్యాలి

& & \&  $   \$
^ & \textasciicircum & % & \%
\ & \textbackslash & # & \#
~  & \textasciitilde & { & \{
_ & \_ & } & \}

అలాగే \\ ను లైనును బ్రేక్ చెయ్యడానికి వాడతారు.

This is good.\\ This is made from pure silk. అని టైపు చేసిన క్రింది విధముగా వచ్చును.

This is good.
 This is made from pure silk.

అలాగే \\[10pt] అనేటటువంటి ఆర్గ్యుమెంటును \\ తరువాత [..] లో ఇచ్చిన రెండు లైనుల మధ్య ఎక్కువ దూరము వచ్చును.

Text Positioning

మనము టైపు చేసిన మాటర్ ను టెక్ తనదైన పద్ధతి లో కూర్చుతుందని తెలుసు కున్నాము. మరి టెక్స్టును రెండు మార్జిన్ ల మధ్యలో టైపు సెట్ చేయాలన్న ఎలా? \begin{center} ... \end{center} అన్న ఎన్వైరాన్మెంటు మధ్య మనము సెంటరు చేయవలసిన మాటర్ టైపు చెయ్యాలి. అలాగే \begin{flushleft}  ... \end{flushleft} అన్న ఎన్వైరాన్మెంటు మధ్య కనక మాటర్ ను టైపు చేసిన కుడి వేపు మార్జిన్ కు మాటరు జస్టిఫై అవును. అలాగే \begin{flushleft} ... \end{flushleft} మధ్య మాటర్ ను టైపుచేసిన ఎడమవైపు మార్జిన్ కు మాటరు జస్టిఫై అగును.


Note : నేను గమనించినది ఏమిటంటే ఈ బ్లాగును చాలా మంది follow అవుతున్నారు. మీకు కనక LaTeX నేర్చుకోవాలని ఉంటే నా e-mail కు message పెట్టండి. నేను బ్లాగు పెడుతున్నదంతా XeLaTeX వాడి పుస్తకంగా తయారు చేస్తున్నాను. బ్లాగులో కొన్ని విషయాలు సరిగ్గా రావట్లేదు. నేను తయారు చేస్తున్న పుస్తకం ఏ అధ్యాయానికి ఆ అద్యాయం మీకు మెయిల్ చేస్తాను.

మీరు కనక ProTeXt లేక TeXLive ను దింపుకోలు చేసుకోవడం లో ఇబ్బంది పడుతుంటే నాకు చెప్పండి (దాదాపు గా 1.5 – 2.5 GB material) . మీకు DVD పంపడానికి ట్రై చేస్తాను (భారతదేశంలో మాత్రం). నా మెయిల్ ఐడి dvgtex AT gmail DOT com